Breaking News

నందిపేట్ తహసిల్దార్‌పై సస్పెన్షన్ వేటు..?

నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు – సబ్ కలెక్టర్ విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ చర్య

నందిపేట్ జూలై 17 : E6 న్యూస్, శివ ఠాకూర్.

నందిపేట్ తహసిల్దార్ సంతోష్ రెడ్డిపై జిల్లా యంత్రాంగం సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.. నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు నిర్వహించడం, లబ్ధిదారులతో కుమ్మక్కై అక్రమ మార్గంలో పట్టాలు జారీ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని సమాచారం.

నందిపేట్ తహసిల్దార్‌పై గత కొంతకాలంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పలువురు బాధితులు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగాస్ మాల్వియాను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.విచారణలో సంబంధిత భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, లబ్ధిదారుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం సబ్ కలెక్టర్ తన నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. నివేదికలో ప్రాథమికంగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలడంతో తహసిల్దార్ సంతోష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తుంది.

భూముల వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడే అధికారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ప్రజల ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ విచారణలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ కొనసాగుతుండగా, విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తే సంబంధిత ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *