Breaking News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు

ఎన్‌వోసీ జారీకి రూ.60 వేల లంచం డిమాండ్ – ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్‌ను పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఆదిలాబాద్, జూలై 16: E6 న్యూస్

ఆదిలాబాద్ జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో విజయవంతమైన దాడి నిర్వహించారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్‌ను రూ.60 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగేహస్తం పట్టుకున్నారు.ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా సోనాల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మాణానికి అవసరమైన నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయడానికి సంబంధిత అధికారులను బాధితుడు సంప్రదించాడు. అయితే ఎన్‌వోసీ మంజూరు చేయడానికి అధికారులు రూ.60 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు నిర్వహించిన ఉచ్చులో ఇద్దరు అధికారులు లంచం స్వీకరిస్తుండగా పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి రూ.60 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేసినా లేదా స్వీకరించినా వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *