Breaking News

‘ఇందూర్ రణభేరి’ సెగతో కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి డైవర్షన్ రాజకీయమే: బీజేపీ

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే కాంగ్రెస్ లక్ష్యం: దినేష్ పటేల్ కులాచారి

బహిరంగ చర్చకు కాంగ్రెస్ నేతలు రాలేదు.. బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండించిన బీజేపీ

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ పూర్తి మద్దతు

    నిజామాబాద్,జూలై 20: E6 tv NEWS (శివ ఠాకూర్)

    ఇందూర్ రణభేరి కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విశేష స్పందనతో కాంగ్రెస్ పార్టీ వణికిపోతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ‘ఎమ్మెల్యే ఇంటి ముట్టడి’ పేరుతో రాజకీయ డ్రామాకు తెరలేపిందని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆరోపించారు.

    సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం నిర్వహించిన ‘ఇందూర్ రణభేరి’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఆ స్పందనను తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు వివాదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

    బహిరంగ చర్చకు రావాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇందూర్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు సవాల్ విసిరితే వారు స్పందించకుండా వెనక్కి తగ్గారని పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి, బహిరంగ చర్చ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి తగిన భద్రత కల్పించాలని సూచించారని తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల అరెస్టులను ఎంపీ తీవ్రంగా ఖండించారని పేర్కొన్నారు.

    సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటికి వస్తామని ప్రకటించిన నేపథ్యంలో, వారు వస్తే స్వాగతిస్తామని ముందుగానే స్పష్టం చేశామని దినేష్ పటేల్ తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పైడి రాకేష్ రెడ్డి గత 30 నెలల్లో అసెంబ్లీతో పాటు వివిధ వేదికలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.700 కోట్ల అభివృద్ధి నిధులు, 3,000 ఇండ్లు మంజూరు చేయించారని అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కూడా ఆర్మూర్‌కు తీసుకొచ్చామని చెప్పారు.అంకాపూర్‌లో అభివృద్ధిపై చర్చకు రావాలని ఆహ్వానించినా కాంగ్రెస్ నాయకులు స్పందించలేదని, మరోవైపు బీజేపీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయించడం ప్రభుత్వ వైఖరిని బయటపెడుతోందని విమర్శించారు.

    జిల్లా కలెక్టరేట్‌లో సాగునీటి అంశంపై కీలక సమావేశం జరుగుతుండగా ఆ సమావేశానికి వెళ్లకుండా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణలను హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని దినేష్ పటేల్ ఆరోపించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, ఇందూర్ జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ నాయకత్వంలో ఎంతటి పోరాటానికైనా బీజేపీ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *