ఎల్ ని నో పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాలి – అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
పీఎం ఫసల్ బీమా అమలు, నిజాంసాగర్‌కు నీటి సరఫరాపై ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే
ఇందూరు, జూలై 20: E6 tv NEWS శివ ఠాకూర్.
ఎల్ ని నో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరి పంటతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్ నినో సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రభుత్వ దృష్టికి పలు సూచనలు చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనివల్ల సాగునీటి సమస్య తీవ్రంగా మారే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహిస్తున్నప్పటికీ, వరి పంటకు మాత్రమే బోనస్ ప్రకటించడం వల్ల రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల సజ్జలు, కందులు, కొర్రలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలకు కూడా బోనస్ ప్రకటిస్తే రైతులు పంటల మార్పిడికి ముందుకు వస్తారని సూచించారు.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పీఎం ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు బీమా రక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు అవసరమని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేవని, బినోల్ నుంచి అలీసాగర్ వరకు రూ.900 కోట్లతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను వెంటనే ప్రారంభించాలని కోరారు. అలాగే కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి హల్దీ వాగుకు నీటిని లిఫ్ట్ చేసి నిజాంసాగర్‌ను నింపే చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో సుమారు నాలుగు లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయని, వాటికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం ద్వారా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు.

