Breaking News

ప్రపంచానికి మరో చమురు గండం: సౌదీపై హూతీల నావికా దిగ్బంధం.. పెరుగుతున్న పెట్రో మంటలు!

రియాద్: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు సముద్ర మార్గాలకు సైతం విస్తరిస్తున్నాయి. యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై నావికా దిగ్బంధం (Naval Blockade) విధిస్తున్నట్లు చేసిన సంచలన ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సౌదీకి వ్యతిరేకంగా సముద్ర మార్గాలను మూసివేస్తామన్న హూతీల బెదిరింపులను సౌదీ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ నౌకలు, ప్రయోజనాల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఏంటి ఈ నావికా దిగ్బంధం?

ఇప్పటికే అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ మూతపడింది. దీంతో సౌదీ అరేబియా తన ఎర్రసముద్ర తీరంలోని ఎగుమతి కేంద్రాల ద్వారా ‘బాబ్ అల్-మందేబ్’ జలసంధి మీదుగా ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే ప్రయత్నం చేసింది. అయితే, ఇప్పుడు యెమెన్ తీరంలో ఉన్న ఈ ‘బాబ్ అల్-మందేబ్’ జలసంధిని నిరోధిస్తామని హూతీలు బెదిరిస్తుండటంతో ప్రపంచ చమురు రవాణా పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది.

ప్రపంచ దేశాలపై పడే తీవ్ర ప్రభావం ఎంత?

బాబ్ అల్-మందేబ్ జలసంధి మూతపడితే ప్రపంచవ్యాప్తంగా 25 శాతం చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉనట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • భారత్‌కు పెను ముప్పు: సౌదీ అరేబియా ఎగుమతి చేసే క్రూడ్ ఆయిల్‌లో భారత్ దాదాపు 10.5 శాతం కొనుగోలు చేస్తోంది. అలాగే చైనా (25.6%), దక్షిణ కొరియా (15.8%), జపాన్ (15.4%) దేశాలు సౌదీ చమురుపై విపరీతంగా ఆధారపడి ఉన్నాయి. ఈ మార్గం మూతపడితే భారత్, చైనా సహా ఆసియా దేశాలలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగి, ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.
  • రెక్కలు రానున్న పెట్రోల్, డీజిల్ ధరలు: సాధారణంగా బ్యారెల్‌కు 70 డాలర్లుగా ఉండే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం 90 డాలర్ల మార్కును దాటింది. ఒకవేళ ఈ దిగ్బంధం అమలైతే క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సవాలును ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఏ క్షణంలోనైనా యుద్ధ తీవ్రతను పెంచుతామని హూతీలు ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *