డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ నియంత్రణ, ఎన్నారై సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్, జూలై 22 (E6 tv NEWS ప్రతినిధి): జిల్లా శాంతిభద్రతలు, డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ క్రమశిక్షణ, మహిళల భద్రత, ఎన్నారై సమస్యల పరిష్కారంలో ప్రతి పౌరుడు బాధ్యతగా భాగస్వామి కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్‌ఎస్‌సీ) సమీక్షా సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.
జిల్లాలో ప్రజల భద్రత, విద్యార్థుల రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రత, పట్టణాభివృద్ధి, ఎన్నారైలకు సంబంధించిన సమస్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో డ్రగ్స్ నియంత్రణ, ట్రాఫిక్ అవగాహన, ఈవ్‌టీజింగ్ నివారణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, ఈవ్‌టీజింగ్ లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా డయల్-100 / 1908కు సమాచారం అందించాలని కోరారు.
విద్యార్థుల రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్న కమిషనర్, మైనర్లు వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించి పిల్లలకు అనుమతి లేకుండా వాహనాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.పట్టణాభివృద్ధి, పరిశుభ్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ, సీసీ కెమెరాల ఏర్పాటు, అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండటం వంటి అంశాల్లో ప్రజలు పోలీస్ శాఖతో కలిసి పనిచేయాలని సూచించారు. ఇటీవల ఎన్నారైలకు సంబంధించిన మోసాలు, కుటుంబ వివాదాలు, ఆస్తి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఎన్నారైలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
సమాజంలో డ్రగ్స్ రహిత వాతావరణం, మహిళలకు భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ నెలకొల్పాలంటే పోలీస్ శాఖ, విద్యాసంస్థలు, సెక్యూరిటీ కౌన్సిల్, తల్లిదండ్రులు, ప్రజలు సమిష్టిగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎన్‌ఎస్‌సీ సెక్రటరీ డాక్టర్ కవిత రెడ్డి, ట్రెజరర్ సంతోష్, జాయింట్ సెక్రటరీలు రజనీకాంత్, శిరీష్, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ఉష, దుష్యంత్, హితాని, రాజీవ్ దువా, ఇనాని తదితరులు పాల్గొన్నారు.

