Breaking News

వర్షభావ పరిస్థితుల్లో రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలి

అన్నిరకాల పంటలకు రైతు యూనిట్‌గా పంటల బీమా అమలు చేయాలి: ఏఐయూకెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్

ఆర్మూర్, జూలై 25: (E6 tv NEWS ప్రతినిధి)

రాష్ట్రంలో ఏర్పడిన వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు అన్నిరకాల పంటలకు రైతును యూనిట్‌గా తీసుకొని పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకెఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్‌లో ఏఐయూకెఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సురేష్ అధ్యక్షతన నిర్వహించిన నిజామాబాద్ రూరల్ సంయుక్త సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే దాదాపు 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే కరువు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ఈ దశలో పూర్తికావాల్సిన వ్యవసాయ పనులు నిలిచిపోయాయని, వరి సాగు 20 నుంచి 30 శాతం మాత్రమే పూర్తికాగా, పత్తి పంట కూడా సగానికి చేరుకున్నప్పటికీ అధిక భాగం ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు నష్ట నివారణ చర్యలు చేపట్టి రైతులకు తక్షణ సహాయం అందించాలని ఆయన కోరారు.

ఏఐయూకెఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. దేవారం మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం గణనీయంగా పడిపోయిందని, ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటి సమస్య కూడా తీవ్రతరం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టి రైతులను, గ్రామీణ ప్రజలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో ఏఐయూకెఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సురేష్, జిల్లా కార్యదర్శి బి. బాబన్న, ఉపాధ్యక్షులు యు. రాజన్న, యు. పరమేష్, సహాయ కార్యదర్శులు ఆర్. దామోదర్, బి. కిషన్, కోశాధికారి ఎం. లింబాద్రి, జిల్లా నాయకులు ఎం. నారగౌడ్, టి. గంగాధర్, ఇ. రమేష్, జి. శేఖర్, ఏ. సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *