హైదరాబాద్ / న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో (2026) తెలంగాణకు అవసరమైన ఎరువుల సరఫరా తగినంతగా అందుబాటులో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంట్లో వెల్లడించారు. లోక్సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు. ఎరువుల నల్లబజారు (బ్లాక్ మార్కెటింగ్), దారి మళ్లింపును అరికట్టేందుకు ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (EC Act, 1955) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.
ఏప్రిల్ నుండి జులై 17 మధ్య తెలంగాణలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, దారిమళ్లింపులపై జరిపిన తనిఖీల వివరాలను మంత్రి వెల్లడించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు:
- బ్లాక్ మార్కెటింగ్ కేసులు:
- 28 మందికి షోకాజ్ నోటీసులు జారీ.
- 9 మంది లైసెన్సులు రద్దు లేదా సస్పెన్షన్.
- 3 ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదు.
- ఎరువుల దారిమళ్లింపు (Diversion) కేసులు:
- 3 షోకాజ్ నోటీసులు జారీ.
- 2 లైసెన్సులు రద్దు / సస్పెండ్.
- 1 ఎఫ్ఐఆర్ నమోదు.
‘భారత్ బ్రాండ్’ ఎరువుల పంపిణీకి చర్యలు:
నిజామాబాద్, జగిత్యాల సహా రాష్ట్రంలోని ప్రధాన వ్యవసాయ జిల్లాల్లో రైతులకు వేళకు ‘భారత్ బ్రాండ్’ ఎరువులను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రింది చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు:
- సీజనల్ కేటాయింపులు: రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన డిమాండ్ ఆధారంగా కేంద్రం ఎరువులను కేటాయిస్తోంది.
- రోజువారీ పర్యవేక్షణ: ఎరువుల ఉత్పత్తి, నిల్వలు, రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా మరియు విక్రయాలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు.
- డిబిటి (DBT) విక్రయాలు: జులై 21 నాటి లెక్కల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా రాయితీ ఎరువుల పంపిణీ కోసం 11,529 రిటైల్ కేంద్రాలలో PoS (పాయింట్ ఆఫ్ సేల్) పరికరాలను అందుబాటులో ఉంచారు.
- అదనపు నిల్వలు: ఎక్కడైనా ఎరువుల డిమాండ్ హఠాత్తుగా పెరిగితే వెంటనే అదనపు నిల్వలను పంపేలా ఏర్పాట్లు చేశారు.

