ఇందూరు ఆగస్టు 2: E6 tv NEWS (శివ ఠాకూర్).
నిజామాబాద్, ఆగస్టు 2: తెలంగాణ జానపద సంస్కృతి, గ్రామదేవతల ఆరాధన, సర్వ సమాజ్ ఐక్యతకు ప్రతీకగా నిలిచే నిజామాబాద్ (ఇందూర్) ఊర పండుగను ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల రోజునే జరిగే ఈ ఉత్సవం శతాబ్దాల చరిత్రను కలిగి ఉండి, నగర ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసం, సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఊర పండుగ ప్రధాన ఉద్దేశ్యం గ్రామదేవతలను ప్రసన్నం చేసి నగరాన్ని వ్యాధులు, ప్రకృతి విపత్తులు, కలరా వంటి మహమ్మారుల నుంచి రక్షించాలని ప్రార్థించడం. అలాగే సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని భక్తులు గ్రామదేవతలను కొలుస్తారు. ఈ పండుగ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఏ ఒక్క కులానికి పరిమితం కాకుండా 55 కులాల పెద్దలతో కూడిన ‘ఇందూర్ సర్వ సమాజ్ కమిటీ’ ఆధ్వర్యంలో నగరవాసులందరూ కలిసికట్టుగా నిర్వహిస్తారు.నిజామాబాద్ ఊర పండుగకు విశిష్టమైన చారిత్రక నేపథ్యం ఉంది. మొఘలాయిల పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన బల్మూరి కొండల రాయుడు మరియు భోగంసాని వీరత్వానికి గుర్తుగా సిర్నాపల్లి సంస్థానాధీశురాలు రాణి సీలం జానకీ బాయి ఇందూర్ ఖిల్లాలో వారి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించే సంప్రదాయాన్ని ప్రోత్సహించినట్లు చరిత్ర చెబుతోంది.1953 ప్రాంతంలో నగరంలో వరదలు, కలరా వంటి వ్యాధులు విజృంభించిన సమయంలో ప్రజలంతా ఒక్కటై గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించగా పరిస్థితులు చక్కబడినట్లు స్థానిక విశ్వాసం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఊర పండుగను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.ఉత్సవాలకు ముందు ‘బండారు’ పూసి పండుగకు శ్రీకారం చుడతారు. అనంతరం సంప్రదాయ వడ్రంగులు మామిడి చెట్టు కలపతో పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ, సర్లమ్మ, పగడాలమ్మ తదితర గ్రామదేవతల విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు.


అర్ధరాత్రి సమయంలో ఈ విగ్రహాలను చారిత్రక నిజామాబాద్ ఖిల్లాలోని రఘునాథ ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్లి గోదావరి పుణ్యజలాలతో జలాభిషేకం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఖిల్లా నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర పెద్ద బజార్, గాంధీ చౌక్, గుర్బాబాది రోడ్డు మీదుగా దుబ్బ వరకు సాగుతుంది.ఈ శోభాయాత్రలో శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, జానపద కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అనంతరం ధాన్యాలు, పసుపుతో తయారు చేసిన ‘సారి ప్రసాదాన్ని’ ఇళ్లపై, వీధుల్లో చల్లడం ద్వారా దుష్టశక్తులు తొలగి ఐశ్వర్యం కలుగుతుందనే విశ్వాసాన్ని భక్తులు పాటిస్తారు.
శోభాయాత్ర అనంతరం మామిడి కలపతో తయారు చేసిన గ్రామదేవతల విగ్రహాలను గోదావరి నదిలో నిమజ్జనం చేయడంతో ఊర పండుగ ముగుస్తుంది. సంప్రదాయం, సంస్కృతి, సామాజిక ఐక్యత, గ్రామదేవతల ఆరాధనను ఒకే వేదికపై చాటిచెప్పే ఈ ఉత్సవం నిజామాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.


