మద్నూర్‌లో సామూహిక మరుగుదొడ్ల ప్రారంభోత్సవం
మద్నూర్, ఆగస్టు 3: E6 tv NEWS(M. మస్నాజీ)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ తీసుకెళ్లారు. సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాలనీలో డ్రైనేజీ సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
అనంతరం మద్నూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.



