Breaking News

మత్తు వీడితే ఉజ్వల భవిష్యత్తు మీదే: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

ధర్పల్లి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి).

విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలు, మద్యం, పొగాకు, డిజిటల్ వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ హైస్కూల్‌లో “నషా ముక్త్ భారత్ అభియాన్–మిషన్ స్పందన”లో భాగంగా ఓం శాంతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినులు మార్చ్‌పాస్ట్‌తో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వ్యసన రహిత సమాజ నిర్మాణం యువత భవిష్యత్తు, కుటుంబాల ఆనందం, దేశ ప్రగతికి అత్యంత అవసరమని పేర్కొన్నారు.రాష్ట్రంలో డ్రగ్స్ ఫ్రీ సమాజం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాల వారీగా ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి పకడ్బందీగా నిఘా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

యువతకు విద్యతో పాటు నైపుణ్యాలు కూడా అవసరమని, అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తోందని చెప్పారు. జ్ఞానం మాత్రమే కాకుండా నైపుణ్యాలను పెంపొందించుకుంటే స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వివరించారు.భారతదేశంలో యువత అధికంగా ఉండటంతో వారిని లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాలను ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, యువత అప్రమత్తంగా ఉండి వ్యసనాలకు దూరంగా ఉండటమే కాకుండా ఇతరుల్లో కూడా అవగాహన కల్పించాలని సూచించారు.

ఒత్తిడి, చెడు స్నేహాలు, కుటుంబ పర్యవేక్షణ లోపం, జీవితంలో ఎదురయ్యే నిరాశలు వ్యసనాలకు ప్రధాన కారణాలని పేర్కొన్న ఎమ్మెల్యే, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బ్రహ్మ కుమారీస్ వంటి సంస్థలు నిర్వహించే ధ్యానం, కౌన్సెలింగ్ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయని తెలిపారు. యోగా, ధ్యానం, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.అనంతరం విద్యార్థులతో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే, “సర్వరోగ నివారిణి ఒక్క చదువే” అని పేర్కొంటూ ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బాల్‌రాజు, మండల అధ్యక్షుడు నరేష్, గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, పార్టీ నాయకులు ఉమ్మాజీ నరేష్, హన్మండ్లు, మనోహర్ రెడ్డి, మాంగిత్య నాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్, మహేష్, ప్రశాంత్, ఓం శాంతి సంస్థ ప్రతినిధులు రేణుక, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *