Breaking News

ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం ఇందూరు యువత అదృష్టం: సీపీ సాయి చైతన్య

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

70కి పైగా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు.. 2,500 మందికి పైగా అభ్యర్థుల హాజరు

నిజామాబాద్, ఆగస్టు 9: (E6 tv NEWS, శివ ఠాకూర్).
ప్రజాభివృద్ధితో పాటు యువత భవిష్యత్తు కోసం కృషి చేసే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 70కి పైగా కంపెనీలు పాల్గొనగా, 2,500 మందికి పైగా నిరుద్యోగ యువత హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాజకీయాలతో పాటు ప్రజల అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం కృషి చేసే నాయకులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. యువతకు లభిస్తున్న ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని యువత ఉన్నత స్థాయికి ఎదగాలని సీపీ సూచించారు. అయితే టెక్నాలజీకి బానిసలుగా మారకుండా జాగ్రత్త వహించాలన్నారు. జాబ్ మేళాలో ఉద్యోగం లభించని వారు నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో ప్రయత్నించాలని సూచించారు. ప్రస్తుత ప్రయత్నాన్ని ఒక అనుభవంగా తీసుకుని భవిష్యత్తును మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని అన్నారు.

యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే ధన్‌పాల్

ఇందూరు యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉందని, వారి ప్రతిభకు సరైన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఇందూరు భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు.తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్నారని, వారు మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలన్నదే వారి ప్రధాన కోరిక అని పేర్కొన్నారు. ఒక యువకుడికి ఉద్యోగం కల్పించడం అంటే కేవలం ఒక వ్యక్తికి ఉపాధి కల్పించడం కాదని, మొత్తం కుటుంబానికి భరోసా కల్పించినట్లేనని అన్నారు.

యువతకు సరైన వేదిక అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించి ఒకే వేదికపై 70కి పైగా కంపెనీలను తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని యువతకు సూచించారు. ఉద్యోగాల కోసం తప్పనిసరిగా హైదరాబాద్, ఇతర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గించి నిజామాబాద్‌లోనే మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమన్నారు.

నిజామాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం

నిజామాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఇటీవల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబును కలిసి నిజామాబాద్ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు అందజేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో నిజామాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, యువతకు అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

మెగా జాబ్ మేళాకు సుమారు 2,500 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ కంపెనీల్లో ఎంపికైన అభ్యర్థులకు అనంతరం ధ్రువపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, మఠం పవన్, శ్రవణ్, పసునూరి రాము, ప్రసూన శ్రీనివాస్, ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, బంటు రాము, బంటు ప్రీతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *