న్యూఢిల్లీ ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి).
ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్ను న్యూఢిల్లీలో కలిశారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు.
దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, సహాయక పరికరాల పంపిణీ, ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీల్చైర్లు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాల కోసం అంచనా శిబిరాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు.అలాగే దివ్యాంగులకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంచడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో అవసరమైన అందుబాటు సౌకర్యాలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి దివ్యాంగుడికి చేరేలా కృషి చేస్తున్నామని ఎంపీ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరుతూ కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఎంపీ అర్వింద్ చేసిన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి డా. వీరేంద్ర కుమార్ సానుకూలంగా స్పందించారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

