హైదరాబాద్‌లోని ప్రముఖ కె.బి.ఆర్ పార్క్ (KBR Park) పరిసర ప్రాంతాల్లో ఈ నెల 18 (ఆగస్టు 18) నుంచి అమలు చేయనున్న సరికొత్త వన్-వే (One-Way) ట్రాఫిక్ నిబంధనలపై నగర ట్రాఫిక్ పోలీసులు ఉదయం వాకింగ్ వచ్చే ప్రజలతో ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు.
ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్, డీసీపీ ట్రాఫిక్-II కాజల్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు శుక్రవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద వాకర్లతో మాట్లాడి, రాబోయే ట్రాఫిక్ మార్పుల గురించి వివరించారు. కొత్త ట్రాఫిక్ నిబంధనలు సఫీగా అమలు జరిగేలా పార్క్ సందర్శకులు, వాహనదారులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ పోలీసుల సూచనలు & నియమాలు:
- పార్కింగ్ నిబంధనలు: వాహనాలను రోడ్లపైన కాకుండా, నిర్దేశించిన పార్కింగ్ స్థలాలు (Designated Parking Bays) మరియు మల్టీలేవల్ పార్కింగ్ ఏరియాలో మాత్రమే నిలపాలి.
- రాంగ్ రూట్ డ్రైవింగ్ నిషిద్ధం: ముఖ్యంగా తెల్లవారుజాము సమయంలో చాలామంది రాంగ్ రూట్లో వాహనాలు నడుపుతున్నారని.. దానిని పూర్తిగా నివారించి, నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.
- మల్టీలేవల్ ట్రాఫిక్ సూచనలు: పోలీసులు కేటాయించిన డివైడర్లు, సైన్ బోర్డుల ఆధారంగా నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించాలి.
సలహాలు, సూచనల కోసం క్యూఆర్ కోడ్ (QR Code): ప్రతిపాదిత వన్-వే ట్రాఫిక్ విధానంపై కేబీఆర్ పార్క్ వాకర్స్, స్థానికులు తమ సలహాలు మరియు సూచనలు ఇవ్వడానికి పార్క్ ముందు భాగంలో ఒక క్యూఆర్ కోడ్‌ను (QR Code) అందుబాటులో ఉంచుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సందర్శకులు తమ ఫీడ్‌బ్యాక్‌ను నేరుగా అందించవచ్చు.

