పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి.
బాధిత చిన్నారులకు సత్వర న్యాయం అందించాలి: సీపీ పి. సాయి చైతన్య
నిజామాబాద్, ఆగస్టు 16:(E6tv NEWS: శివ ఠాకూర్).
జిల్లాలో చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో కేసుల దర్యాప్తు, కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పోక్సో కేసులను ఒక్కొక్కటిగా పరిశీలించారు.కేసుల వారీగా ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, నిందితుల గుర్తింపు, అరెస్టులు, సాక్ష్యాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాలు, బాధిత చిన్నారుల వాంగ్మూలాలు, కేసుల ప్రస్తుత స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను గుర్తించి, దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.
నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయడంతో పాటు బాధిత చిన్నారులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. పోక్సో కేసుల్లో చిన్నారుల భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బాధితుల పట్ల సున్నితమైన వైఖరితో వ్యవహరించాలని అధికారులకు సూచించారు.దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన ఎఫ్ఎస్ఎల్ పరీక్షలను త్వరగా పూర్తి చేసి నివేదికలు పొందాలని ఆదేశించారు. బాధితులు, నిందితులకు సంబంధించిన వైద్య పరీక్షలను కూడా ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు.



కేసుల్లో లభించే సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు, ఇతర సాంకేతిక సాక్ష్యాలను నిబంధనల ప్రకారం సేకరించి దర్యాప్తులో సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలు, కీలక ఆధారాలను పకడ్బందీగా నమోదు చేసి, కేసులు న్యాయస్థానంలో బలంగా నిలిచేలా దర్యాప్తు చేపట్టాలని సూచించారు.ఎఫ్ఎస్ఎల్, మెడికల్ రిపోర్టులు తదితర దర్యాప్తు ప్రక్రియలు పూర్తయిన వెంటనే చార్జ్‌షీట్ దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. పోక్సో కేసుల్లో చార్జ్‌షీట్ దాఖలులో అనవసర జాప్యం ఉండకూడదని, సాధ్యమైనంత తక్కువ సమయంలో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న ప్రతి పోక్సో కేసును సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, సాంకేతిక లేదా పరిపాలనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. చిన్నారులపై జరిగే లైంగిక నేరాల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా వేగవంతమైన, శాస్త్రీయ, నాణ్యమైన దర్యాప్తు చేపట్టడమే లక్ష్యమని సీపీ పి. సాయి చైతన్య స్పష్టం చేశారు.
సమీక్ష సమావేశంలో డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మల్లేషం, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్యతో పాటు సీఐలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

