Breaking News

బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

బాల్కొండ నియోజకవర్గంలో 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరిక

కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్: ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి).

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.కమ్మర్‌పల్లి మండలం కొనాపూర్, కే.సీ. తండాలకు చెందిన సీనియర్ నాయకులు లకావత్ కన్నయ్య, చిలివేరి సత్యనారాయణ, తండా పెద్దమనిషి దేవులునాయక్, గుగ్లావత్ శ్రీనివాస్ నాయకత్వంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వేల్పూర్‌లో బీఆర్ఎస్ నాయకులు రాజాగౌడ్, గ్రామ పార్టీ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2,500, పింఛన్లను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంపు, రూ.500కే గ్యాస్ సిలిండర్, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం వంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని విమర్శించారు.

రైతులు, గిరిజనుల సమస్యలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఉన్న రూ.10 వేల సాయాన్ని కూడా సక్రమంగా అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. యూరియా, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సరైన నిర్వహణ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తరుగు పేరుతో రైతులకు నష్టం జరుగుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.

లగచర్లలో లంబాడాల భూముల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులతో కలిసి పోరాడి వారి హక్కుల కోసం నిలిచారని వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.ప్రజా వ్యతిరేక విధానాలతో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, భవిష్యత్‌లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.తండా ప్రజల కష్టసుఖాల్లో తాను ఎల్లప్పుడూ అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. గిరిజన సోదరీమణుల కోరిక మేరకు త్వరలో నిర్వహించనున్న తీజ్ పండుగ వేడుకలకు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉతకం నర్సయ్య, బడాలా రమేష్ (పీఏసీఎస్ చైర్మన్), బడాలా రాజారెడ్డి, పుర్కుటపు చిన్నారెడ్డి, పురుషోత్తం, జాల రాజు, పాలేపు గంగారెడ్డి, బోట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *