కరీంనగర్, ఆగస్టు 24: (E6tv NEWS: ప్రతినిధి).
కోరపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో నకిలీ ఆర్.ఓ.ఆర్., 13(బి), 13(సి) సర్టిఫికెట్లు సృష్టించడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంకటేశ్వరపల్లికి చెందిన బోయిని లావణ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.కోరపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 553/ఎలో 4 ఎకరాల 32 గుంటల భూమిని తాను కొనుగోలు చేశానని లావణ్య తెలిపారు. తన పేరుపై మ్యూటేషన్ కోసం ధరణిలో స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ దరఖాస్తు పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఇదే భూమిని మరికొందరు రైతుల భూములతో కలిపి కాజేయాలనే ఉద్దేశంతో గిరబోయిన శ్రీనివాస్, గిరబోయిన కొమురయ్య పేర్లతో నకిలీ ఆర్.ఓ.ఆర్ పత్రాలు సృష్టించారని ఆమె ఆరోపించారు.
ఆర్.ఓ.ఆర్./703/2011, 13(బి), 13(సి)కు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా, జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయం నుంచి అందిన సమాచారంలో పలు అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయని లావణ్య తెలిపారు. 2011 సెప్టెంబర్ 5న జారీ చేసినట్లు పేర్కొంటున్న పత్రంపై తహశీల్దార్ కె. భాస్కర్‌రావు సంతకం ఉన్నప్పటికీ, ఆ సమయంలో ఆయన జమ్మికుంట తహశీల్దార్‌గా పనిచేయలేదని పేర్కొన్నారు. ఆ కాలంలో జి. శంకరయ్య తహశీల్దార్‌గా విధులు నిర్వహించినట్లు రికార్డుల ద్వారా తెలిసిందన్నారు.అదేవిధంగా కోరపల్లి గ్రామ పహాణీ, 1-బి రికార్డుల్లో మార్పులు, చేర్పులు జరిగినట్లు అనుమానాలున్నాయని లావణ్య ఆరోపించారు. సంబంధిత అసలు రెవెన్యూ రికార్డులను పరిశీలించి, మార్పులు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. గతంలో కూడా ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమగ్ర విచారణ జరగలేదని తెలిపారు.
ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు లావణ్య పేర్కొన్నారు. హైకోర్టు పరిణామాల నేపథ్యంలో జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో గిరబోయిన శ్రీనివాస్, గిరబోయిన కొమురయ్య తదితరులపై ఎఫ్‌ఐఆర్ నెం. 299/2026, తేదీ 22-07-2026న కేసు నమోదైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.నకిలీగా పేర్కొంటున్న ఆర్.ఓ.ఆర్ పత్రాలను రద్దు చేసి, రెవెన్యూ రికార్డుల్లోని తప్పులను సరిచేయడంతో పాటు ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలితే సంబంధిత ప్రభుత్వ, శాఖాపరమైన బాధ్యులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బోయిని లావణ్య కోరారు. ఫిర్యాదు ప్రతులను కరీంనగర్ పోలీస్ కమిషనర్, హుజురాబాద్ ఆర్డీవో, ఏసీపీ, జమ్మికుంట తహశీల్దార్, జమ్మికుంట టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌లకు అందజేశారు.


