Breaking News

కాంగ్రెస్ పాలనలో రైతు దగా.. ప్రతి రైతు కుటుంబానికి రూ.6 లక్షల బాకీ: వేముల

కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకాలను పునరుద్ధరించాలి

యూరియా యాప్ రద్దు చేసి నేరుగా ఎరువులు అందించాలి

బాల్కొండలో భారీ రైతు సదస్సు.. వేలాది మంది రైతుల తరలింపు

వేల్పూర్, సెప్టెంబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతు రాజుగా బతికితే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్నదాత దగా, మోసానికి గురవుతున్నాడని విమర్శించారు. “ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదు” అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వేల్పూర్ ఎక్స్‌రోడ్ వద్ద నిర్వహించిన రైతు సదస్సులో వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సదస్సుకు వేలాది మంది రైతులు తరలిరావడం ప్రభుత్వ విధానాలపై రైతుల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

విద్యుత్ కోతలపై విమర్శలు

తెలంగాణ ఉద్యమ సమయంలో రైతులు ఎదుర్కొన్న కరెంట్ కోతలు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలను వేముల గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత, నాణ్యమైన వ్యవసాయ విద్యుత్ అందించిందని తెలిపారు.బాల్కొండ నియోజకవర్గంలో 18 సబ్‌స్టేషన్లు, 45 భారీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేశామని చెప్పారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు కనీసం 11 గంటల విద్యుత్ కూడా సక్రమంగా ఇవ్వలేకపోతోందని ఆరోపించారు.

సాగునీటి ప్రాజెక్టులపై ప్రశ్నలు

కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 45 వేల చెరువులను పునరుద్ధరించిందని వేముల పేర్కొన్నారు. బాల్కొండ పరిధిలో కప్పలవాగు, పెద్దవాగులపై 22 చెక్‌డ్యాంలను నిర్మించామని తెలిపారు.వరదల కారణంగా దెబ్బతిన్న చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేపట్టాల్సింది పోయి.. కొన్ని ప్రాంతాల్లో వాటిని కూల్చివేయడం దుర్మార్గమని విమర్శించారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి కొరతను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1,900 కోట్లతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని పూర్తి చేసిందని గుర్తు చేశారు. పోచంపాడులో నీటి నిల్వ ఉన్నప్పటికీ కప్పలవాగు, పెద్దవాగులకు నీరు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించాలి

మేడిగడ్డ బ్యారేజీ వద్ద పిల్లర్లు దెబ్బతిన్న అంశాన్ని సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చారని వేముల ఆరోపించారు. కాళేశ్వరం పంపులను పునరుద్ధరించి గోదావరి జలాలను చెరువులకు తరలించాలని డిమాండ్ చేశారు.

బాల్కొండ పరిధిలోని పలు ఎత్తిపోతల పథకాలు, లిఫ్టులు పనిచేయకుండా ఉన్నాయని.. వాటిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు.

యూరియా కొరతపై ఆగ్రహం

ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చిందని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఎరువుల కొరతను కప్పిపుచ్చుకునేందుకే యూరియా మొబైల్ యాప్ విధానాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు.యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి.. పీఏసీఎస్ సొసైటీలు, డీలర్ల ద్వారా నేరుగా రైతులకు ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు.

రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌పై విమర్శలు

రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. రైతు సదస్సులో పలువురు రైతులు తమకు రుణమాఫీ కాలేదని తెలిపారని వేముల అన్నారు.ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి.. పాత రైతుబంధు బకాయిలను కూడా చెల్లించలేదని ఆరోపించారు. వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి కొన్ని సన్న రకాలకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు.రుణమాఫీ రూ.2 లక్షలు, బోనస్ రూ.3 లక్షలు, రైతు భరోసా బకాయిలు రూ.1 లక్ష కలిపి నాలుగు ఎకరాలున్న ప్రతి రైతు కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 లక్షల వరకు బాకీ పడిందని వేముల ఆరోపించారు.

‘బాకీ కార్డు’ ఫ్లెక్సీలపై హెచ్చరిక

కాంగ్రెస్ ఎన్నికల హామీల వైఫల్యాలను ఎండగడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ‘కాంగ్రెస్ గ్యారంటీల బాకీ కార్డు’ ఫ్లెక్సీలను అధికారులు, పోలీసులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని వేముల ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కని అన్నారు. ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు, రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఐక్యంగా తిరగబడాలని పిలుపునిచ్చారు. అవసరమైతే తానే ముందుండి అడ్డుకుంటానని అన్నారు.

రైతు సదస్సులో రైతుల ఆమోదంతో ఎనిమిది ప్రధాన డిమాండ్లను ఏకగ్రీవంగా ఆమోదించారు.

రైతులందరికీ రూ.2 లక్షల సంపూర్ణ రుణమాఫీ, ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా బకాయిల చెల్లింపు, అన్ని పంటలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, 24 గంటల నాణ్యమైన ఉచిత వ్యవసాయ విద్యుత్, యూరియా యాప్‌ల రద్దు, కాళేశ్వరం–ఎస్సారెస్పీ పునర్జీవ పథకాల పునరుద్ధరణ, సాగునీటి లిఫ్టుల పునరుద్ధరణ, రైతుబీమా ప్రీమియం చెల్లింపు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఎన్నికల హామీల ఫలాలు కాంగ్రెస్ నేతల మాటల్లో కాకుండా రైతుల చేలల్లో కనిపించాలని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కే.ఆర్. సురేష్ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పీఏసీఎస్ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వేలాది మంది రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *