హైదరాబాద్ (E6TV):
తెలంగాణ శాసనసభలో 22ఏ (నిషేధిత భూముల) అంశం తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రంలో జరుగుతున్న భూ దందాలు, నిషేధిత జాబితాలో భూముల కేటాయింపులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శాసనసభ్యులు సభలో ఆందోళనకు దిగారు.
వాయిదా తీర్మానంపై పట్టు:
ఉదయం సభ ప్రారంభం కాగానే 22ఏ భూముల అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించి వెంటనే చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. అయితే, ఈ సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్పప్పటికీ నియమావళికి విరుద్ధంగా ప్లకార్డులు ప్రదర్శించడంపై స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లకార్డులను సభలోకి తీసుకురావద్దని సభ్యులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం స్పందన:
మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుంటూ.. 22ఏ భూముల వ్యవహారంపై సభలో సమగ్ర చర్చ జరిపేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విపక్షాలు నిరసనలు ఆపి చర్చకు సహకరించాలని కోరారు.
హోరెత్తిన నినాదాలు – వాయిదా:
మంత్రి విజ్ఞప్తి, స్పీకర్ హెచ్చరికలను పక్కనపెట్టి బీజేపీ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలపడమే కాకుండా పెద్దెత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆందోళనలు శాంతించకపోవడంతో స్పీకర్ అసెంబ్లీ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేశారు.

