Breaking News

గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).

గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.గణేష్ మండపాల నిర్వాహకులు మండపం ఏర్పాటు చేసే ముందు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు పోలీసు శాఖ రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో మండపానికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు అనంతరం దరఖాస్తు వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని సూచించారు.

మండపాలను ప్రధాన రహదారులు, ప్రజా రవాణా మార్గాలు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా ఏర్పాటు చేయరాదన్నారు. విద్యుత్ శాఖ అనుమతులతోనే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, 24 గంటలు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు తగిన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు మండపాలకు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు.

డీజేలకు అనుమతి లేదు

గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసుల అనుమతితో నిబంధనలకు లోబడి పరిమిత శబ్దంతో స్పీకర్లు మాత్రమే వినియోగించాలని తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లను వినియోగించరాదని పేర్కొన్నారు. చిన్నారులు, వృద్ధులు, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అధిక శబ్దాలు చేయరాదన్నారు.

నిమజ్జన శోభాయాత్రలో నిబంధనలు పాటించాలి

గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు. నిర్ణీత సమయాల్లోనే నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తూ ప్రజలు, ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. శోభాయాత్రలో టపాసులు పేల్చడం, డీజేలు ఏర్పాటు చేయడం నిషేధమని తెలిపారు.శోభాయాత్రలో పాల్గొనే వారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రహదారులపై వాహనాలను నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించరాదని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో పోలీసుల సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు.

సమస్యాత్మక వ్యక్తులపై నిఘా

ఉత్సవాల సందర్భంగా రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లు, సమస్యాత్మక వ్యక్తులపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తూ పోలీసు శాఖకు ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు సంపూర్ణ సహకారం అందించాలని ఎస్పీ రోహిత్ రాజు విజ్ఞప్తి చేశారు.

గణేష్ మండపాల ఆన్‌లైన్ నమోదు:
policeportal.tspolice.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *