భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
జిల్లా షూటింగ్ క్రీడకు మరో ఘనత లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన బాలికల విభాగంలో, కొమరోజు శ్రీరామ్ బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు.
కేరళలోని త్రివేండ్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహిస్తున్న సౌత్‌జోన్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్-2026 అర్హత పోటీల్లో భావన, శ్రీరామ్ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. క్రమశిక్షణతో కూడిన శిక్షణ, నిరంతర సాధనతో పాటు కోచ్ ఎం.డి. అబ్దుల్ నబి మార్గదర్శకత్వంలో ఈ ఇద్దరు క్రీడాకారులు ఈ ఘనత సాధించారు.జాతీయస్థాయి షూటింగ్ పోటీలు ఈ ఏడాది డిసెంబర్లో డెహ్రాడూన్ షూటింగ్ రేంజ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయస్థాయిలోనూ భావన, శ్రీరామ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా క్రీడాభిమానులు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, తోటి క్రీడాకారులు భావన, శ్రీరామ్‌లను అభినందించారు.జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఎం. పరంధామ రెడ్డి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు భావన, శ్రీరామ్‌తో పాటు కోచ్ ఎం.డి. అబ్దుల్ నబిని ప్రత్యేకంగా అభినందించారు. జాతీయస్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
భావన, శ్రీరామ్‌ల జాతీయస్థాయి ఎంపిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షూటింగ్ క్రీడ అభివృద్ధికి మరో మైలురాయిగా నిలిచిందని జిల్లా క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

