నిజామాబాద్, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి)
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఇందూర్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన రైతులు, మహిళలు, యువకులు, సామాన్య ప్రజల త్యాగాలను స్మరించుకోవాలని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17న రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో అధికారికంగా వేడుకలు నిర్వహించాలని, సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు “స్టాట్యూ ఆఫ్ లిబరేషన్–తెలంగాణ” పేరుతో విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన మ్యూజియం, ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే పాఠశాలల్లో తెలంగాణ విమోచన చరిత్రపై వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించాలని, రజాకార్ల దురాగతాలకు గురైన గ్రామాల్లో ప్రత్యేక స్మారక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. విమోచన పోరాటానికి సంబంధించిన చారిత్రక ప్రాంతాలను అనుసంధానిస్తూ తెలంగాణ విమోచన పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.సెప్టెంబర్ 17ను ఘనంగా నిర్వహించి తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాలని దినేష్ పటేల్ కులాచారి కోరారు.


