Breaking News

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమరా ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలి

పాల్వంచలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ఐక్య సంఘాల నిరసన

రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను అవమానిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిక

పాల్వంచ, సెప్టెంబర్‌ 9:(E6tv NEWS: ప్రతినిధి).

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అమరా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ఐక్య సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం పాల్వంచలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద బహుజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, ఆయనను అవమానిస్తూ పుస్తకం రాస్తానని సవాల్‌ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను అవహేళన చేసే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. అమరా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్‌ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

ఇకపై కూడా రాజ్యాంగం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు శనగ వెంకటేశ్వర్లు, బొమ్మెర శ్రీనివాస్, ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా నాయకులు కుశ నాయక్, ఆరెం ప్రశాంత్, సోయం సత్యనారాయణ, గొడ్ల మోహన్‌రావు, బరగడి దేవదానం, గోడ రమేష్, వాసుమల్ల సుందర్రావు, మంజూరు అలీ ఖాన్, పెంకి శ్రీనివాస్, మెంటం బలరాం, అల్లూరి సాంబశివరావు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *