2 లక్షల ఎకరాల పంటలను కాపాడేందుకు 6 టీఎంసీలు విడుదల చేయాలి
అన్ని ఎత్తిపోతల పథకాలను పూర్తి సామర్థ్యంతో నడపాలి: వేముల ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ)లో సుమారు 46 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలో రైతుల పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. సుమారు 2 లక్షల ఎకరాల పంటలను కాపాడేందుకు వెంటనే 6 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో చెరువులు, బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఎత్తిపోతల పథకాలను పూర్తి సామర్థ్యంతో నడపకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
గుత్ప లిఫ్ట్‌కు 540 క్యూసెక్కుల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం ఒక మోటారు ద్వారా 135 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారని తెలిపారు. నాలుగు మోటార్లను పూర్తి సామర్థ్యంతో నడిపితే నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోని అనేక చెరువులను నింపవచ్చన్నారు.అలీసాగర్ లిఫ్ట్‌కు 720 క్యూసెక్కుల సామర్థ్యం ఉందని, నాలుగు మోటార్లను పూర్తి స్థాయిలో నడపాలని కోరారు. లక్ష్మి కెనాల్, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్ట్, నవాబ్, బోధేపల్లి, వేంపల్లి లిఫ్ట్‌లను వెంటనే ప్రారంభించి పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేశారు. వీటి ద్వారా చెరువులను నింపి పంటలను కాపాడవచ్చన్నారు.
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరదకాలువను నింపి లో-లెవల్ తూముల ద్వారా చెరువులకు నీటిని అందించాలని, ప్యాకేజీ-21 ద్వారా కప్పలవాగు, పెద్దవాగులోని చెక్‌డ్యామ్‌లను నింపాలని సూచించారు. సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్‌లను ప్రారంభించి కప్పలవాగు, పెద్దవాగు ఔట్లెట్ల ద్వారా నీటిని విడుదల చేస్తే సుమారు 48 వేల ఎకరాల పంటలను కాపాడే అవకాశం ఉందన్నారు.గాయత్రి పంప్‌హౌస్ ద్వారా వరదకాలువలోకి రివర్స్ పంపింగ్ చేసి బాల్కొండ, కోరుట్ల నియోజకవర్గాల్లోని చెరువులను నింపాలని కోరారు. ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ ఎగువ ప్రాంతాలైన బాల్కొండ, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ఆయకట్టుకు కాకతీయ కెనాల్ ద్వారా నీరు అందించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు 7–8 గంటల విద్యుత్ మాత్రమే అందుతోందని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. వేల్పూర్ మండలం పడగల్ సబ్‌స్టేషన్ పరిధికి చెందిన రైతు హన్మంత్‌రెడ్డి పంపిన సందేశాన్ని మీడియా సమావేశంలో చదివి వినిపించారు. ఉదయం 7 గంటలకు విద్యుత్ ప్రారంభమై 11.30 గంటలకు నిలిచిపోయిందని, తిరిగి 12.45 గంటల వరకు సరఫరా లేకపోయిందని, సాయంత్రం 4.45 గంటలకే మళ్లీ సరఫరా నిలిపివేస్తున్నారని రైతు తెలిపినట్లు పేర్కొన్నారు.
రైతుల ప్రయోజనాల విషయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టి జిల్లాలోని అన్ని ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తి సామర్థ్యంతో నడపాలని, అవసరమైన మేరకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతు, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణమని ఆయన విమర్శించారు.

