న్యూఢిల్లీ: ప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో (Packaged Foods) క్రొవ్వులు, చక్కెర, ఉప్పు వంటి హానికర పోషకాల మోతాదుపై వినియోగదారులను హెచ్చరించే ‘ఫ్రంట్-ఆఫ్-ప్యాకేజ్ లేబులింగ్’ (FoPL) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రతిపాదించిన దశలవారీ లేబులింగ్ విధానంపై మరిన్ని స్పష్టతలు ఇవ్వాలని జస్టిస్ జె.బి. ప్యాగీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
కేవలం అక్షరాలతో కూడిన వార్నింగ్లు కాకుండా, చదువురాని వారికి కూడా సులభంగా అర్థమయ్యేలా చిత్రాలతో (Pictorial Representation) కూడిన హెచ్చరిక లేబుళ్లను రూపొందించాలని అత్యున్నత నాయస్థానం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రెండు దశల అమలు కాలపరిమితి, ఫాంట్ సైజు, తీపి పానీయాల పరిమితులపై 10 రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐని ఆదేశించింది. అలాగే, చిన్న పిల్లల్లో జంక్ ఫుడ్ సంస్కృతిని నివారించేందుకు పాఠశాలల పాఠ్యాంశాల్లో పోషకాహార విజ్ఞానాన్ని (Nutritional Literacy) ఎలా చేర్చుతారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 28కి వాయిదా పడింది.

