బీటీ రహదారులు, వంతెనల అభివృద్ధికి భారీగా నిధుల మంజూరు
దసరాలోపే పనులు ప్రారంభం.. 15 ఏళ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే
పినపాక, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి)
పినపాక నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. నియోజకవర్గంలోని బీటీ రహదారులు, వంతెనలు, బ్రిడ్జిల నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం హెచ్‌ఏఎం నిధుల నుంచి సుమారు రూ.186 కోట్లు మంజూరైనట్లు పినపాక ఎమ్మెల్యే తెలిపారు.
మంజూరైన నిధులతో నియోజకవర్గంలోని అవసరమైన రహదారులు, వంతెనల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, గ్రామాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం కానుందని తెలిపారు.దసరా పండుగలోపే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. హెచ్‌ఏఎం విధానంలో చేపట్టే పనులకు సంబంధిత సంస్థలే సుమారు 15 సంవత్సరాలపాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టే విధంగా నిబంధనలు ఉంటాయని తెలిపారు.
ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తూ రహదారులు, వంతెనల నిర్మాణానికి భారీగా నిధులు సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంజూరైన నిధులతో పినపాక నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయి. రహదారులు, వంతెనల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పనులను వేగంగా ప్రారంభిస్తాం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

