Breaking News

రైతు కుటుంబంలో వెల్లువెరిసిన విద్యా కుసుమాలు

ఒకరికి ఎంబీబీఎస్.. మరొకరికి ఎన్‌ఐటీ శ్రీనగర్‌లో సీటు
పడంపల్లి రైతు దంపతుల పిల్లలకు అరుదైన ఘనత

జుక్కల్, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి).
రైతు కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివి ఇద్దరు పిల్లలు ఉన్నత విద్యలో సీట్లు సాధించి గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు. జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు పావుడే సరస్వతి, గంగాధర్‌ల కుమారుడు పావుడే వెంకట సాయి విష్ణు ఎంబీబీఎస్ సీటు సాధించగా, కుమార్తె పావుడే ప్రతీక ఎన్‌ఐటీ శ్రీనగర్‌లో ఇంజినీరింగ్ సీటు సాధించింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

వెంకట సాయి విష్ణు, ప్రతీకలు మద్నూర్ మండలంలోని కార్మెల్ హైస్కూల్‌లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. అనంతరం వెంకట సాయి విష్ణు మద్నూర్ ప్రభుత్వ మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ కళాశాలలో నీట్, జేఈఈ మెయిన్స్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యారు.వైద్యుడిగా కొనసాగుతున్న మేనమామ శ్రీనివాస్ పటేల్‌ను చిన్ననాటి నుంచి స్ఫూర్తిగా తీసుకున్న వెంకట సాయి విష్ణు డాక్టర్ కావాలనే లక్ష్యంతో కష్టపడ్డాడు. నీట్‌లో మంచి ర్యాంకు సాధించి, మొదటి రౌండ్‌లోనే 475 మార్కులతో మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటును కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా పొందాడు.

అదేవిధంగా అన్నను స్ఫూర్తిగా తీసుకున్న ప్రతీక జేఈఈ మెయిన్స్‌లో 95 శాతం మార్కులు సాధించి జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించింది. అనంతరం ఎన్‌ఐటీ శ్రీనగర్‌లో ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) బ్రాంచ్‌లో సీటు సాధించి ఇటీవల అడ్మిషన్ పొందింది.గ్రామీణ, మారుమూల ప్రాంతానికి చెందిన రైతు కుటుంబంలో ఒకే సమయంలో ఇద్దరు పిల్లలు ఉన్నత విద్యలో సీట్లు సాధించడం అరుదైన ఘనతగా స్థానికులు పేర్కొంటున్నారు. పడంపల్లి గ్రామంతో పాటు మద్నూర్ మండలంలోని వారు, విద్యాభ్యాసం చేసిన పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాత రామ్ పటేల్‌కు చెందిన ఆవల్‌గావ్ గ్రామంలోనూ ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆనందం వ్యక్తమైంది.

తమ విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేనమామ అందించిన ప్రోత్సాహం, సహకారమే కారణమని వెంకట సాయి విష్ణు, ప్రతీక తెలిపారు. భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వెంకట సాయి విష్ణు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేయగా, ప్రతీక ఎన్‌ఐటీలో ఉన్నత విద్యను పూర్తి చేసి దేశ సేవకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది.

రైతు కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలు ఒకేసారి వైద్య, ఇంజినీరింగ్ రంగాల్లో ఉన్నత విద్యకు ఎంపిక కావడంతో పడంపల్లి గ్రామంలో సంతోషకర వాతావరణం నెలకొంది. వారి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను సాధించాలని పలువురు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *