Breaking News

మట్టి గణపతులనే పూజించాలి.. డీజేలపై పూర్తి నిషేధం

వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి).

వినాయక చవితి పండుగను నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు సూచించారు. సర్కిల్ పరిధిలోని ఎస్సైలతో కలిసి విడుదల చేసిన వీడియో ద్వారా మండప నిర్వాహకులు, ప్రజలకు పలు సూచనలు చేశారు.

మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం: పర్యావరణ పరిరక్షణలో భాగంగా రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని సీఐ సూచించారు.

నీటి కాలుష్యాన్ని నివారించాలి: ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు, కుంటల్లో నీటి మట్టాలు తగ్గాయని తెలిపారు. రంగుల విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు కలుషితమై తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు పర్యావరణహిత నిమజ్జనానికి సహకరించాలని కోరారు.

డీజేలపై పూర్తి నిషేధం: శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు డీజేల వినియోగంపై పూర్తి నిషేధం విధించినట్లు సీఐ స్పష్టం చేశారు. గణేష్ మండపాల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలీసులకు సహకరించాలి: జిల్లా ఎస్పీ జారీ చేసిన మార్గదర్శకాలను గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని, పండుగను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని సీఐ చరమంద రాజు కోరారు.

ఈ కార్యక్రమంలో పాలకవీడు ఎస్సై కోటేష్, నేరేడుచర్ల ఎస్సై గోపాల్ రెడ్డి, గరిడేపల్లి ఎస్సై శ్రీకాంత్, మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *