ఆశా వర్కర్ల అరెస్టులను ఖండించిన సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు
ఏర్గట్ల, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా ఆశా కార్యకర్తలను అర్ధరాత్రి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్‌బాబు అన్నారు. మహిళా కార్యకర్తలను సైతం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.మంగళవారం డిచ్పల్లి, ఇందల్వాయి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించిన ఆశా వర్కర్లను ఆయన పరామర్శించారు. అలాగే ఏర్గట్ల మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్లు అనురాధ, సుజాత, చంద్రకళ, ప్రేమ, సంతోష, భాగ్యలను పరామర్శించి వారి విడుదలకు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచినా ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదని విమర్శించారు. దీంతో గత్యంతరం లేక తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు.శాంతియుతంగా హైదరాబాద్‌కు వెళ్లి తమ సమస్యలను చెప్పుకునేందుకు సిద్ధమైన ఆశా వర్కర్లను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం ద్వారా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాపాలన ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, అక్రమ అరెస్టులు, నిర్బంధాలను వెంటనే నిలిపివేయాలని రమేష్‌బాబు డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు స్వప్న, గంగుబాయి, పద్మతో పాటు పలువురు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

