మనీలా (ఫిలిప్పీన్స్): ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు అత్యంత సంక్షోభ పూరితంగా, అస్థిరంగా (Turbulent) ఉన్నాయని, వీటిని ఏ ఒక్క దేశం లేదా కూటమి ఒంటరిగా ఎదుర్కొనే పరిస్థితి లేదని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత్ – ఆసియాన్ (ASEAN) దేశాల మధ్య భాగస్వామ్యం, సహకారం మరింత బలోపేతం కావడం అత్యంతావశ్యకమని ఆయన ఉద్ఘాటించారు.
మనీలా వేదికగా ‘ఆసియాన్-ఇండియా’ సదస్సు
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న క్వాడ్ (Quad) దేశాల సమావేశంతో పాటు ‘ఆసియాన్-ఇండియా పోస్ట్-మినిస్టీరియల్ కాన్ఫరెన్స్’లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మనీలా చేరుకున్నారు. బుధవారం జరిగిన ఈ సదస్సులో ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యదర్శి ఎన్రిక్ ఏ. మనాలోతో కలిసి ఆయన సహ-అధ్యక్షత వహించారు.
కీలక రంగాల్లో పరస్పర భాగస్వామ్యం
ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. వర్తకం-మదుపు (Trade & Investment), డిజిటల్, సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హరిత ఇంధనం-సుస్థిరత (Green & Sustainability), అలాగే కనెక్టివిటీ రంగాల్లో భారత్-ఆసియాన్ కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. భారత్-ఆసియాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కంట్రీ కోఆర్డినేటర్‌గా ఫిలిప్పీన్స్ వహిస్తున్న పాత్రను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.

