Breaking News

భూ కేటాయింపులపై కేటీఆర్‌వి అబద్ధపు ప్రచారాలు: మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తు

హైదరాబాద్: భూ కేటాయింపులు మరియు ఇతర అంశాలపై బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ పండించిన వడ్లకు ఎంత మద్దతు ధర వచ్చిందో ముందుగా రైతులకు కేటీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

భూ కేటాయింపులపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టిన శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చట్టబద్ధమైన నిబంధనలకు కట్టుబడి పారదర్శకంగా భూములను కేటాయించిందని స్పష్టం చేశారు.

శ్రీధర్ బాబు కామెంట్స్ – ముఖ్యాంశాలు:

  • భూముల ధరల పోలిక: గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరా భూమిని ₹90 లక్షలకు కేటాయిస్తే.. తమ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎకరాకు ₹1.50 కోట్లకు కేటాయించిందని తెలిపారు. 5 ఎకరాల భూమిని ₹7.5 కోట్లకు కేటాయిస్తే, కేటీఆర్ ₹200 కోట్ల కుంభకోణం అని ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
  • హిల్ట్ (HILT) పాలసీ & పారిశ్రామికవేత్తలు: హిల్ట్ పాలసీ వల్ల హైదరాబాద్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని.. రాజకీయ లబ్ధి కోసం పారిశ్రామికవేత్తల్లో కేటీఆర్ భయాందోళనలు సృష్టించవద్దని హెచ్చరించారు.
  • గోబెల్స్ ప్రచారం చెల్లదు: బిఆర్‌ఎస్ అనుసరిస్తున్న గోబెల్స్ తరహా అసత్య ప్రచారాలను లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని ఎద్దేవా చేశారు.
  • కృష్ణా, గోదావరి జలాల్లో రాజీపడేది లేదు: నీటి కేటాయింపుల విషయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించిందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని, త్వరలో జరగబోయే గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశంలో తెలంగాణ హక్కుల తరఫున గట్టిగా వాదిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *