Breaking News

“డైరెక్టర్ సీట్లలో యంగ్ హీరోలు.. టాలీవుడ్‌లో కొత్త రేంజ్ ప్రయోగాలు!”

హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. దర్శక నిర్మాతల కథల కోసం వేచి చూడకుండా, తమ ఐడియాలను స్వయంగా తెరకెక్కించేందుకు యంగ్ హీరోలు మెగాఫోన్ పడుతున్నారు. తాజాగా సుధీర్ బాబు, కార్తికేయలు తమ స్వీయ దర్శకత్వంలో కథానాయకులుగా నటిస్తూ సినిమాలు చేయబోతున్నారనే ప్రచారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే విశ్వక్ సేన్ (‘కల్ట్’), రామ్ పోతినేని (RAPO 23), కిరణ్ అబ్బవరం తమ సొంత ప్రాజెక్టులతో దర్శకులుగా మారుతున్నట్లు ప్రకటించారు.

హీరోలు దర్శకులుగా మారడానికి కారణాలేంటి?

వరుస ప్లాప్‌లు రావడం, ఆకట్టుకునే కథలు లభించకపోవడం మరియు అనుభవం లేని దర్శకులపై ఆధారపడటం కంటే తమను తాము తెరపై బాగా చూపించుకోవచ్చనే నమ్మకమే దీనికి ప్రధాన కారణమని ఒక ప్రముఖ నిర్మాత అభిప్రాయపడ్డారు. “స్టైలిస్ట్‌ను నమ్ముకోవడం కంటే సొంతంగా డ్రెస్ చేసుకోవడం మేలని భావించినట్లే.. క్రియేటివ్ కంట్రోల్ తమ చేతుల్లో ఉంచుకోవడానికే హీరోలు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు” అని వ్యాఖ్యానించారు.

సినీ విశ్లేషకులు, నిర్మాతల కామెంట్స్:

  • నిర్మాత సి. కళ్యాణ్:“హీరోలు దర్శకత్వం వహించడం మంచిదే. దీనివల్ల నిర్మాతల కష్టాలు, బడ్జెట్ పరిమితులు, ఒక్కో రూపాయి విలువ వారికి అర్థమవుతుంది. కేవలం నటులుగా ఉన్నప్పుడు నిర్మాతల నష్టాలతో సంబంధం లేకుండా తదుపరి ప్రాజెక్ట్‌కి వెళ్ళిపోతారు. కాబట్టి మరింత మంది హీరోలు డైరెక్షన్ వైపు రావాలి.”
  • దర్శకుడు హేమంత్ మధుకర్:“వేరొక దర్శకుడి పనిలో జోక్యం చేసుకోవడం (Ghost Direction) కంటే, తామే నేరుగా బాధ్యత తీసుకుని దర్శకత్వం వహించడం మంచి పరిణామం. అయితే, ఒకసారి దర్శకుడిగా మారిన తర్వాత వేరే దర్శకులు ఆ హీరో వద్దకు కథలు తీసుకెళ్లడానికి భయపడే అవకాశం ఉంది. ఈ రిస్క్‌ను హీరోలు గుర్తించాలి.”

గత చరిత్ర ఏం చెబుతోంది?

క్యామెరా వెనుక విజయం సాధించడం అందరికీ సాధ్యం కాలేదు. గతంలో రాజ్‌కపూర్, ఎన్టీఆర్ వంటి దిగ్గజాలు నటులుగా, దర్శకులుగా రికార్డులు సృష్టించారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు మాత్రం దర్శకులుగా అనుకున్నంత విజయం సాధించలేకపోయారు.

కోలీవుడ్ నటుడు ధనుష్ ఇటీవల ‘రాయన్’ చిత్రంతో దర్శకుడిగా మెప్పించినప్పటికీ.. నటుడిగా కన్నా దర్శకుడిగా గుర్తింపు పొందడమే అసలైన సవాల్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *