న్యూఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు తీవ్రంగా కుదిపివేశాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కురిసిన కుండపోత వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) జలమయమైంది.
టర్మినల్-3 ప్రాంగణంతో పాటు విమానాశ్రయానికి వెళ్లే రహదారులు నీటమునిగాయి. మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తమ లగేజీ బ్యాగులను పట్టుకుని తీవ్ర ఇబ్బందుల మధ్య రాకపోకలు సాగించారు. పీక్ అవర్స్‌లో వర్షపు నీరు ముంచెత్తడంతో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విమానాల రాకపోకలకు ఆటంకం:
ఈ భారీ వర్షం, ఈదురుగాలుల (గంటకు 76 కి.మీ వేగంతో) కారణంతో విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుని దృశ్యమానత పడిపోయింది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర విఘాతం కలిగింది. ఢిల్లీకి రావాల్సిన దాదాపు 11 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్ ప్రాంతాలకు మళ్లించారు. అలాగే, 500కి పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. IndiGo, Air India వంటి సంస్థలు ప్రయాణికులకు అలర్ట్ జారీ చేస్తూ, విమానాల సమయాలను సరిచూసుకోవాలని సూచించాయి.
అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టులో ఇలాంటి పరిస్థితి దాపురించడంపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా డ్రైనేజీ వ్యవస్థను, వరద నీటి నిర్వహణను తక్షణమే మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.

