హైదరాబాద్:
అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిణామాలు మరియు స్పీకర్‌పై బిఆర్ఎస్ ఎంఎల్సీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామని టీపీసీసీ సీనియర్ నాయకుడు దేవని సతీష్ మాదిగ ప్రకటించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను వెయ్యి డప్పులతో ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
దళిత, దండోరా, మాల మహానాడు సంఘాలు మరియు కాంగ్రెస్ ఎస్సీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
దేవని సతీష్ ఆరోపణలు & డిమాండ్లు:
- అసెంబ్లీ గందరగోళానికి కుట్ర: సెప్టెంబర్ 6న ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన సమావేశంలోనే కేసీఆర్ అసెంబ్లీలో గందరగోళం సృష్టించేందుకు వ్యూహం రచించారని, నల్ల టీషర్టులతో నిరసనలు మరియు పోలీసులతో ఘర్షణలు ముందస్తు కుట్రలో భాగమేనని ఆరోపించారు.
- దళిత స్పీకర్‌కు అవమానం: దళిత వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి BRS ఎమ్మెల్సీ తాతా మధు అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
- అట్రాసిటీ కేస్ నమోదు చేయాలి: స్పీకర్‌ను కించపరిచిన ఎమ్మెల్సీ తాతా మధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేసిన సతీష్, ఉదయం 11 గంటలకు ఎర్రవల్లికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

