Breaking News

టీజీట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారుల మెరుపు దాడులు!

హైదరాబాద్:
తెలంగాణ ట్రాన్స్‌కో (TGTRANSCO) డిప్యూటీ ఇంజనీర్ (DE) ముత్యం వెంకటరమణకు ఏసీబీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు.
15 ప్రాంతాల్లో ఎనిమిది బృందాల తనిఖీలు
లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 ప్రాంతాల్లో ఎనిమిది ఏసీబీ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. వెంకటరమణతో పాటు ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మార్గాల్లో కూడబెట్టిన చర, స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకునేందుకు ఈ శోధనలు సాగుతున్నాయి.
పరిశీలనలో ఆర్థిక లావాదేవీలు, ఆస్తి పత్రాలు
ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కాగితాలు, బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులను ఏసీబీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న ఆస్తుల పూర్తి విలువ, ఇతర వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *