వాషింగ్టన్: భారతీయ ఫార్మా రంగానికి దిగ్భ్రాంతి కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై (Generic Drugs) భవిష్యత్తులో ఏకంగా 200 శాతం వరకు టారిఫ్‌లు (దిగుమతి సుంకాలు) విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఔషధ తయారీ రంగాన్ని తిరిగి అమెరికాలోనే నెలకొల్పడమే (Reshore) లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
టారిఫ్‌ల పెంపు షెడ్యూల్ ఇదే!
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) వేదికగా ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు:
- ఆగస్టు 1, 2026 నుండి రాబోయే రెండేళ్ల పాటు: జనరిక్ మందులపై జీరో శాతం (0%) సుంకం కొనసాగుతుంది.
- ఆగస్టు 2028 నుండి (ఒక ఏడాది పాటు): దిగుమతి సుంకం 100 శాతానికి పెరుగుతుంది.
- ఆ తర్వాత నుండి: టారిఫ్ ఏకంగా 200 శాతానికి చేరుకుంటుంది.
నిర్దేశిత గడువులోగా అమెరికాలో తయారీ కేంద్రాలను నిర్మించని కంపెనీలకు ఇది ఒక జరిమానా లాంటిదని, అమెరికన్ల రక్షణ కోసమే ఈ విధానాన్ని తీసుకొస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే పేటెంట్ మరియు బ్రాండెడ్ మందులపై పాత విధానమే కొనసాగుతుందని తెలిపారు.
భారత్‌పై పడే తీవ్ర ప్రభావం ఎంత?
ప్రపంచానికి ‘ఫార్మసీ’గా పేరుగాంచిన భారతదేశం.. అమెరికాకు అత్యధికంగా జనరిక్ మందులను ఎగుమతి చేసే దేశాల్లో అగ్రస్థానంలో ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 9.7 బిలియన్ డాలర్ల (రూ. 80,000 కోట్లకు పైగా) విలువైన మందులను ఒక్క అమెరికాకే ఎగుమతి చేసింది. ఇది భారత్ సాధించే మొత్తం ఫార్మా ఎగుమతుల్లో దాదాపు 38 శాతం కావడం గమనార్హం. బిపి, డయాబెటిస్, క్యాన్సర్, ఇన్ఫెక్షన్ల నివారణకు వాడే భారతీయ జనరిక్ మందులపై అమెరికన్లు విపరీతంగా ఆధారపడతారు.
నిపుణులు, వైద్యుల ఆందోళన
అమెరికాలో వాడే ప్రిస్క్రిప్షన్లలో 90 శాతం జనరిక్ మందులే ఉంటాయి. ఇవి ప్రధానంగా భారతదేశంలో తయారవుతాయి. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలో మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా, తీవ్రమైన ఔషధ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు, వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

