Breaking News

దసరా నాటికి విజయవాడకు ‘వందే భారత్ స్లీపర్’ రైళ్లు: విమాన ప్రయాణ అనుభూతిని అందించనున్న నూతన సర్వీసులు!

విజయవాడ: దీర్ఘకాలిక ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ తీపి కబురు అందించింది. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ చైర్ కార్ సర్వీసులను మరింత ఆధునీకరిస్తూ.. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. రాబోయే దసరా పండుగ నాటికి విజయవాడ డివిజన్‌లో ఈ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

విమాన స్థాయి వసతులు.. 160 కి.మీ వేగం!

విమాన ప్రయాణానికి ధీటుగా అత్యున్నత ప్రపంచ స్థాయి వసతులతో ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను తీర్చిదిద్దారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లలో మొత్తం 16 కోచ్‌లు ఉండనున్నాయి.

ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లతో పాటు వీటిలో అత్యాధునిక ఇంటీరియర్స్, ఎల్‌ఈడీ లైటింగ్, సౌండ్‌ప్రూఫ్ క్యాబిన్లు, వై-ఫై సదుపాయం, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ తలుపులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రక్షణ కోసం అత్యాధునిక భద్రతా వ్యవస్థలు, సెన్సార్లను కూడా అమర్చారు.

విజయవాడ మీదుగా నూతన సర్వీసులు!

ప్రస్తుతం విజయవాడ మీదుగా సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నం నగరాలకు వందే భారత్ సిట్టింగ్ రైళ్లు నడుస్తున్నాయి. రాబోయే నెలల్లో స్లీపర్ సర్వీసులు కూడా ప్రారంభమైతే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు వేగవంతమైన, అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *