Breaking News

అమెరికా ‘ఆటా’ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి పిలుపు: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కాండి!

వాషింగ్టన్ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కేవలం భారత్‌లోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అమెరికాలోని మేరీల్యాండ్ బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగిన 19వ ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (ATA) జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఎన్ఆర్‌ఐలకు పిలుపు – పరిశ్రమలకు రెడ్ కార్పెట్:

ఖండాంతరాలు దాటి తమ కష్టార్జితంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎన్ఆర్‌ఐలు (NRIs) తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని స్వరాష్ట్రం, సొంత ఊరి అభివృద్ధికి వినియోగించాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.

  • సింగిల్ విండో సిస్టమ్: “పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తెచ్చాం. మీరు ముందుకొస్తే ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుంది. మిమ్మల్ని సాధరంగా ఆహ్వానించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను ఇక్కడికి పంపారు” అని భట్టి హామీ ఇచ్చారు.
  • 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం: 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్ ప్రణాళికలు – అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు:

  • మూసీ పునరుజ్జీవం: లండన్‌లోని థేమ్స్ నది తరహాలోనే హైదరాబాద్‌లోని 56 కిలోమీటర్ల మూసీ నదిని సుందరీకరించి, స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
  • రీజనల్ రింగ్ రోడ్ (RRR): వైఎస్సార్ హయాంలో వచ్చిన ఓఆర్‌ఆర్ (ORR), శంషాబాద్ ఎయిర్‌పోర్టులు నేడు తెలంగాణకు ఆస్తులుగా మారాయని, ఇప్పుడు ఓఆర్‌ఆర్‌కు అవతల ‘రీజనల్ రింగ్ రోడ్’ (RRR) తో పాటు 36 రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
  • ఫ్యూచర్ సిటీ: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు అనుబంధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఫ్యూచర్ సిటీ’ ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు – ఎన్ఆర్‌ఐలకు ప్రత్యేక వ్యవస్థ:

సామాన్య కుటుంబాల పిల్లలు కూడా గ్లోబల్ స్థాయిలో రాణించేందుకు ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను’ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి ఎన్ఆర్‌ఐలు ఆర్థికంగా, నైతికంగా మద్దతు ఇవ్వాలని కోరారు.

అలాగే ఎన్ఆర్‌ఐలు, ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థను (Special Mechanism) ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) జరుగుతోందని, విదేశాల్లో ఉన్న తెలంగాణ పౌరులు ఆన్‌లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *