నల్లగొండ (E6TV న్యూస్): పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 (GO 97) వల్ల తమ భవిష్యత్తు అంధకారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) గేటు వద్ద కేటీఆర్‌కు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్న కేటీఆర్, వారికి బిఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని కొండంత భరోసానిచ్చారు.
కేటీఆర్ వ్యాఖ్యలు – ప్రధానాంశాలు
- అసెంబ్లీలో మొదటి ప్రాధాన్యత: సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోజనాలపైనే మొదటి ప్రాధాన్యతగా గళం విప్పుతామని, ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంత వరకు వదిలేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
- భూములపై కన్ను: పాలిటెక్నిక్ కళాశాలలకు విలువైన భూములు ఉన్నాయని, ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోని ఈ భూములను ఎత్తుకెళ్లడానికే ప్రభుత్వం ‘స్కిల్ యూనివర్సిటీ’ పేరుతో ఈ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.
- విద్యార్థుల భవిష్యత్తు నాశనం: డిప్లొమా పూర్తయ్యాక ఈసెట్ (ECET) ద్వారా బీటెక్ లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు పొందే అవకాశం లేకుండా, ఉన్నత చదువులకు గండి కొడుతున్నారని మండిపడ్డారు.
- పోరాటం ఆపేది లేదు: జీవో 97ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసుకునే వరకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) నేతృత్వంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

