Breaking News

నింగిలో మబ్బుల దుప్పటి.. భారత్‌ను కప్పేసిన వర్ష మేఘాలు: ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో సంచలన దృశ్యాలు!

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు చెందిన శాటిలైట్ తీసిన చిత్రాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతరిక్షం నుంచి చూస్తే అసలు భారతదేశ భూభాగమే కనిపించనంతగా.. దాదాపు 95 శాతం దేశాన్ని దట్టమైన మేఘాలు ఆవరించేశాయి.
భూమధ్యరేఖకు 36,000 కి.మీ ఎత్తు నుంచి..
భారత వాతావరణ శాఖ (IMD) అందించిన వివరాల ప్రకారం.. ఇస్రోకు చెందిన INSAT-3DR, INSAT-3DS ఉపగ్రహాలు జూలై 22న తెల్లవారుజామున 2:15 నుండి 3:27 గంటల మధ్య ఈ చిత్రాలను చిత్రీకరించాయి. థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ (Thermal Infrared) సాంకేతికత ద్వారా రాత్రి వేళలో తీసిన ఈ ఫోటోలలో దేశమంతటా దట్టమైన పరుచుకున్న మబ్బుల పొర స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ ప్రాంతాల్లో మినహా అంతటా మబ్బులే!
ఈ ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. ఉత్తర బంగాళాఖాతం నుంచి ప్రారంభమైన భారీ మేఘాల వరుస ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా గుజరాత్, అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉంది. కేవలం పశ్చిమ రాజస్థాన్, కచ్ ప్రాంతాలలో తప్ప, మిగిలిన ఉపఖండమంతా మేఘావృతమై ఉంది.
ఈ మేఘాల ఎత్తు కొన్ని చోట్ల ఏకంగా 16 కిలోమీటర్ల వరకు పెరిగినట్లు, తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న కొన్ని రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *