Breaking News

నిజాంపేట్‌ భూ వివాదం.. ఇప్పుడు కాంగ్రెస్‌ నేతల మెడకు చుట్టుకుంటుందా?

నిజాంపేట్‌ భూ వివాదం.. ఇప్పుడు కాంగ్రెస్‌ నేతల మెడకు చుట్టుకుంటుందా?

రూ.65 లక్షల హామీపై వివాదం.. 260 గజాల భూమి వ్యవహారంలో కీలక మలుపు

మాజీ మేయర్‌ భర్త, స్థానిక కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని కథ నడిపిస్తున్నారా?

బండారు లేఅవుట్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వాసు పాత్రపై తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్‌: నిజాంపేట్‌ సర్వే నంబర్‌ 94లోని సుమారు 260 గజాల భూమి వివాదం ఇప్పుడు రాజకీయ నేతల మెడకు చుట్టుకునే దిశగా వెళ్తోందా? రూ.65 లక్షల చెల్లింపు హామీ, భూమి రిజిస్ట్రేషన్‌, నాలుగు ప్లాట్ల విక్రయాలు, గతంలో అనుమతుల నిరాకరణ.. ప్రస్తుతం అనుమతులు ఎలా వచ్చాయన్న ప్రశ్నలతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది.

2013లో సేల్‌డీడ్‌ నంబర్‌ 11722/2013 ద్వారా భూమిని కొనుగోలు చేసినట్లు మురళీమోహన్‌ తెలిపారు. అనంతరం గొల్ల శివరామకృష్ణ, శివకుమార్‌లతో 50:50 అభివృద్ధి ఒప్పందం జరిగినట్లు పేర్కొన్నారు. నాలుగు విల్లాలు నిర్మించి ప్లాట్లుగా విభజిస్తామని చెప్పి, తన వాటాకు సంబంధించిన భూమిని గ్యారంటీగా రిజిస్టర్‌ చేయించుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

అయితే రూ.65 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, రిజిస్ట్రేషన్‌ సమయంలో కేవలం రూ.4 లక్షలు మాత్రమే చెల్లించారని మురళీమోహన్‌ ఆరోపణ. ఆ తర్వాత నిర్మాణం జరగకపోగా, నాలుగు ప్లాట్లను ఇతరులకు విక్రయించినట్లు ఆయన చెబుతున్నారు.

ఇప్పుడు రాజకీయ లింకులపై ప్రశ్నలు

ఈ వ్యవహారం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య భూ వివాదమేనా? లేక దీని వెనుక రాజకీయ పలుకుబడి ఉందా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

మాజీ మేయర్‌ గోపాల్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ భర్తతో పాటు పలువురు స్థానిక రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుని వ్యవహారం నడిపిస్తున్నారని మురళీమోహన్‌ ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా బండారు లేఅవుట్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వాసు ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వివాదాస్పద ప్లాట్లను కొనుగోలు చేసేందుకు వాసు ప్రయత్నిస్తున్నారని మురళీమోహన్‌ ఆరోపిస్తున్నారు.

“పార్టీ పదవి అడ్డుపెట్టుకుని భూమి వ్యవహారాల్లో ప్రభావం చూపుతున్నారా?”

వాసుకు కాంగ్రెస్‌ డివిజన్‌ అధ్యక్షుడిగా ఉన్న రాజకీయ పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం జరుగుతోందా? అన్న అనుమానాలను మురళీమోహన్‌ వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇవన్నీ ప్రస్తుతం మురళీమోహన్‌ చేసిన ఆరోపణలు మాత్రమే. వాసు పాత్ర, కొనుగోలు ప్రయత్నాలు, ఇతర రాజకీయ నాయకుల ప్రమేయం వంటి అంశాలు అధికారిక పత్రాలు, లావాదేవీ ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వివరణతోనే నిర్ధారణ కావాల్సి ఉంది.

అధికారులపై కూడా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు

2021లో ఇదే భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అధికారులు అనుమతులు నిరాకరించారని మురళీమోహన్‌ చెబుతున్నారు. మరి ప్రస్తుతం అదే భూమికి ప్రైవేట్‌ భూమిగా అనుమతులు ఎలా వచ్చాయి?

బాచుపల్లి MRO కార్యాలయ రికార్డులు ఏం చెబుతున్నాయి?
మున్సిపల్‌ రికార్డుల్లో భూమి వర్గీకరణ ఎలా ఉంది?
లేఅవుట్‌ అనుమతులు ఏ ప్రాతిపదికన వచ్చాయి?
గతంలో నిరాకరించిన అనుమతులు ఇప్పుడు ఎలా మంజూరయ్యాయి?
ఈ మార్పులకు సంబంధించిన ఫైల్‌ నోటింగ్స్‌, ఉత్తర్వులు ఏమిటి?

ఈ ప్రశ్నలకు అధికారిక సమాధానాలు రావాల్సి ఉంది.

కాంగ్రెస్‌ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం

ఈ వ్యవహారానికి సంబంధించిన సేల్‌డీడ్లు, రిజిస్ట్రేషన్‌ వివరాలు, మున్సిపల్‌ మరియు రెవెన్యూ రికార్డులు, ఇతర ఆధారాలను సేకరించి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ పెద్దల వద్ద కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని మురళీమోహన్‌ తెలిపారు.

ముఖ్యంగా ఇన్‌చార్జ్‌ మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి భూ లావాదేవీలు జరిగాయా? అధికారుల అనుమతుల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ కోరనున్నట్లు తెలిపారు.

నిజాంపేట్‌ 260 గజాల భూమి వివాదం.. రూ.65 లక్షల వ్యవహారం.. నాలుగు ప్లాట్ల విక్రయాలు.. రాజకీయ నేతల పేర్లు.. ఇప్పుడు వాసు కొనుగోలు ప్రయత్నాలపై ఆరోపణలు.

ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు కథేంటి?

E6TV ఆధారాలతో దశలవారీగా వెలుగులోకి తీసుకురానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *