Breaking News

తెలంగాణ కేబినెట్‌లోకి రాములమ్మ?: కొండా సురేఖ స్థానంలో విజయశాంతికి ఛాన్స్!

హైదరాబాద్:

మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌తో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం సీతక్క ఒక్కరే మహిళా మంత్రిగా ఉండటంతో, సురేఖ స్థానంలో మరొక మహిళా నేతను కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ రేసులో ఫైర్‌బ్రాండ్ నాయకురాలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

రేసులో పలువురు నేతలు – విజయశాంతికే మొగ్గు?:

యశస్వినీ రెడ్డి (పాలకుర్తి), పద్మావతి రెడ్డి (కోదాడ), డాక్టర్ మట్టా రాగమయి (సత్తుపల్లి), చిట్టెం పర్ణికా రెడ్డి (నారాయణపేట) వంటి మహిళా ఎమ్మెల్యేల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ… ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు విజయశాంతి సరైన ఎంపిక అని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె వాయిస్ పార్టీకి ప్లస్ అవుతుందని విశ్లేషిస్తున్నారు.

హోంశాఖపై ప్రచారం & ఢిల్లీ పయనం:

మంత్రి పదవిపై కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు విజయశాంతి ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేబినెట్‌లోకి తీసుకుంటే ఆమె హోంశాఖను ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు కేబినెట్‌లో ఖాళీగా ఉన్న 2-3 స్థానాలను భర్తీ చేస్తూ త్వరలోనే విస్తరణ చేపట్టేందుకు అధిష్ఠానం సన్నాహాలు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *