శ్రీనగర్ :
తరతరాలుగా యాపిల్ పంటకు ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయలో ఇప్పుడు ఒక కొత్త హార్టికల్చర్ విప్లవానికి నాంది పడుతోంది. షేర్-ఎ-కాశ్మీర్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (SKUAST) నిర్వహించిన పరిశోధనల్లో బ్లూబెర్రీస్ (Blueberries) సాగు విజయవంతమైంది. అక్కడ పండిన బ్లూబెర్రీస్ రుచి, పరిమాణం ఊహించిన దానికంటే అద్భుతంగా ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
యాపిల్స్ పండని నేలల్లో బ్లూబెర్రీస్!
యాపిల్ తోటలకు భిన్నంగా బ్లూబెర్రీ సాగు సాగుతుందని ప్రొఫెసర్ అషఫాక్ పండిట్ తెలిపారు:
- అమ్ల గుణం ఉన్న నేలలు: యాపిల్స్ పండటానికి డ్రైనేజీ సదుపాయం ఉన్న సారవంతమైన నేలలు కావాలి. కానీ బ్లూబెర్రీస్ కొండ దిగువ ప్రాంతాలు, వాగుల చుట్టూ ఉండే నేలలు, చిత్తడి ప్రాంతాల్లో (pH విలువ 3.5 నుండి 4.5 ఉన్న అమ్ల నేలల్లో) చాలా బాగా పెరుగుతాయి.
- పనికిరాని భూముల్లో సాగు: కాశ్మీర్‌లో యాపిల్ సాగుకు ఉపయోగపడని వేలాది ఎకరాల పనికిరాని భూముల్లో బ్లూబెర్రీస్‌ను సాగు చేసి ఉత్పాదకతను పెంచవచ్చు.
- వరదలొస్తే మార్చుకోవచ్చు: ఈ మొక్కలను ‘గ్రో బ్యాగ్స్’ (Grow Bags) లో కూడా పెంచవచ్చు. వరదలు వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు వీటిని సురక్షిత ప్రాంతాలకు సులభంగా తరలించవచ్చు.
ఎకరానికి రూ. 64 లక్షల ఆదాయం!
సూపర్ ఫుడ్‌గా పేరుగాంచిన బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రసుతం భారతదేశంలో కిలో బ్లూబెర్రీస్ ధర సుమారు ₹2,000 వరకు ఉంది.
ఆదాయ లెక్కలు:
ఒక ఎకరంలో దాదాపు 3,200 మొక్కలను నాటవచ్చు. ఒక్కో మొక్క నుండి కనీసం 2 కిలోల దిగుబడి వచ్చినా, ఎకరానికి 6,400 కిలోల పంట వస్తుంది. రైతుల వద్ద నుండి కిలో రూ. 1,000 చొప్పున కొనుగోలు చేసినా ఎకరానికి ఏకంగా ₹64 లక్షల ఆదాయం (లేదా కెనాల్ భూమికి ₹8 లక్షలు) వస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇందులో సగం ధర వచ్చినా రైతులకు భారీ లాభమే!
రోగనిరోధక శక్తి ఎక్కువ.. పురుగుమందులు అవసరం లేదు
యాపిల్ తోటలతో పోలిస్తే బ్లూబెర్రీ మొక్కలకు రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి పురుగుమందుల వాడకం దాదాపుగా ఉండదు.
మధ్యప్రదేశ్‌లో వీటిని గ్రీన్‌హౌస్ (Poly-house) లలో పండిస్తుండగా, కాశ్మీర్ వాతావరణం బ్లూబెర్రీస్ సహజంగా పెరగడానికి ఎంతో అనుకూలంగా ఉందని, ఇక్కడ పండే పండ్లు అత్యంత రుచిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కాశ్మీర్ రైతులకు సరికొత్త ఆశల పసంటగా మారనుంది!

