తెలంగాణలోనే 87 కేసులు.. నంద్యాల పోలీసులకు చిక్కిన కళ్యాణదుర్గం వాసి
నంద్యాల, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి)
తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నంద్యాల పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన శివను నిందితుడిగా గుర్తించారు.జల్సాలకు అలవాటు పడిన శివ విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలను గుర్తించిన నంద్యాల పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి స్కూటీ, ఐఫోన్, చేతి గడియారం స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 93 కేసులు ఉన్నట్లు తేలింది. ఇందులో తెలంగాణలో 87 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 6 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మరింత విచారణ కొనసాగిస్తున్నారు.

