Breaking News

యూరియా ఎక్కడ స్వామి.. రైతుల గోడు పట్టదా?

ఎరువుల కొరత, విద్యుత్‌ కోతలపై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేత జీవన్‌రెడ్డి ఆగ్రహం

ఆర్మూర్, సెప్టెంబర్‌ 13:(E6tv NEWS: ప్రతినిధి).


ఎరువుల కొరత, నకిలీ విత్తనాల బెడద, విద్యుత్‌ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆరోపించారు. వినాయక చవితి సందర్భంగా రైతులు తమ సమస్యలను తీర్చాలని గణపతిని వేడుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. “గణపతి బొప్పా మోరియా.. ఎక్కడ స్వామి యూరియా” అంటూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. యూరియా కోసం రైతులు దుకాణాలు, సొసైటీల వద్ద క్యూలు కడుతున్నా అనేక చోట్ల ‘నో స్టాక్‌’ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. యూరియాతో పాటు డీఏపీ కొరత కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.యాప్‌ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్‌ పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎరువుల కొరతను కప్పిపుచ్చేందుకే యాప్‌ విధానాన్ని తీసుకొచ్చారంటూ విమర్శించారు. గత ఏడాది ఎరువులు, ధాన్యం విక్రయాల సమయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు వానాకాలం పంటలకు మళ్లీ ఎరువుల సమస్య తలెత్తిందన్నారు.

ఎడాపెడ కరెంట్‌ కోతలు.. ఎండిపోతున్న పంటలు

రాష్ట్రంలో విద్యుత్‌ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితులకు తోడు విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. కరెంట్‌ కోతల కారణంగా గ్రామాల్లో రైతులు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పలు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లను ముట్టడించే పరిస్థితి ఏర్పడిందన్నారు.కరెంట్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్ల షాపులు తెరుచుకుంటున్నాయని అన్నారు. రైతుల విద్యుత్‌ అవసరాలపై ముందస్తు ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు.

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న సమయంలో ఉత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, యూనిట్ల నిలిపివేతలు సమస్యగా మారాయని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ పనితీరును ప్రస్తావిస్తూ.. విద్యుత్‌ ఉత్పత్తి పరిస్థితి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.

ఇందిరమ్మ రాజ్యమంటేనే వ్యధ.. ప్రజాపాలన అంటే ఇదేనా?” అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ.. “మళ్లీ అదే కాంగ్రెస్‌ పాలన.. అవే పాత కష్టాలు” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు, విమర్శలకే పరిమితమవుతున్నారని, చేతల్లో మాత్రం ఫలితం కనిపించడం లేదని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *