Breaking News

రైతన్న కంట కన్నీరు.. బత్తలపల్లిలో కరువు కష్టాలు

అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిపోతున్న వేల ఎకరాల ఉద్యాన పంటలు

కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ

బత్తలపల్లి, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి)


ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కే. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దేవరగుడి జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఉద్యానవన రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

బత్తలపల్లి మండలం గుమ్మలకుంట గ్రామంలో కరువు పరిస్థితులను సీపీఐ నాయకుల బృందం పరిశీలించింది. నీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో వేల ఎకరాల్లోని పండ్ల తోటలు ఎండిపోతున్నాయని, ఏళ్ల తరబడి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కళ్లముందే నష్టపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చీని తోట రైతు నాగిరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు నాయకులు తెలిపారు.

30 ఏళ్ల నాటి కరువు పరిస్థితులు

ఉమ్మడి అనంతపురం జిల్లా సుమారు 30 ఏళ్ల నాటి దుర్భర కరువు పరిస్థితులను మరోసారి ఎదుర్కొంటోందని కే. రామకృష్ణ, దేవరగుడి జగదీష్ అన్నారు. కరువు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కరువు మండలాలుగా ప్రకటించడంతో పాటు కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, సాగునీటి వనరులు, ఆర్థిక సహాయం అందించి ఉద్యానవన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, చేతివృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షుడు జింకా చలపతి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహదేవ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కుల్లాయప్ప, బత్తలపల్లి మండల కార్యదర్శి వెంకటేష్, ధర్మవరం పట్టణ కార్యదర్శి రవి రమణ, మహిళా సమాఖ్య రమీజా, డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బగ్గిరి బైపరెడ్డి, రైతు గంటాపురం బాబప్ప, వైఎస్సార్‌సీపీ నాయకులు సండ్ర రామకృష్ణతో పాటు గుమ్మలకుంట గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *