Breaking News

సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి

నిజాం-రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి: కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్య

బాల్కొండ, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి)

తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్య అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రజలకు నిజాం పాలన నుంచి వెంటనే విముక్తి లభించలేదన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల దాడులు, హింసకు పరకాల, బైరాన్‌పల్లి, నిర్మల్ ప్రాంతాల్లో జరిగిన ఘటనలు నిదర్శనమని పేర్కొన్నారు.రజాకార్ల నరమేధాన్ని అరికట్టేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారత ప్రభుత్వం నిర్ణయాత్మకంగా చర్యలు చేపట్టిందన్నారు. 1948 సెప్టెంబర్‌ 13న ప్రారంభమైన ఆపరేషన్ పోలో అనంతరం సెప్టెంబర్‌ 17న నిజాం లొంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్రను విస్మరిస్తున్నారు

తెలంగాణ విమోచన చరిత్రకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని లక్ష్మినర్సయ్య విమర్శించారు. సెప్టెంబర్‌ 17ను వివిధ పేర్లతో నిర్వహిస్తూ అసలు విమోచన చరిత్రను పక్కకు నెట్టారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ అమరవీరుల త్యాగాలను విస్మరించడం సరికాదన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ దశాబ్దాలుగా పోరాటం చేస్తోందని తెలిపారు. ఎల్‌.కె. అద్వానీ, చెన్నమనేని విద్యాసాగర్‌రావు, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి తదితర నాయకులు ఈ ఉద్యమంలో కీలకంగా పోరాడారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్‌ 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం చారిత్రక పరిణామమన్నారు.

తెలంగాణ విమోచన పోరాటం ఏ ఒక్క మతానికో, వర్గానికో పరిమితమైనది కాదని, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటమని అన్నారు. తుర్రేబాజ్‌ ఖాన్, షోయబుల్లా ఖాన్, వందేమాతరం రామచంద్రరావు, కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, స్వామి రామానంద తీర్థ తదితరుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా సగర్వంగా నిర్వహించి, అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, బాల్కొండ మండల అధ్యక్షుడు అంబటి నవీన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఆరెపల్లి నర్సయ్య, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కు నర్సయ్య, ఉపాధ్యక్షుడు తోట చిన్నయ్య, నాయకులు ముస్కు భూమేశ్వర్, లింగాగౌడ్, దినేష్, సత్యనారాయణ, లింగం, రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.

జై తెలంగాణ.. భారత్ మాతా కీ జై!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *