కాలుష్యరహిత ధర్మవరం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: పరిటాల శ్రీరామ్
ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
ధర్మవరం, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి).
పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన ధర్మవరం పట్టణం సిల్క్ సిటీతో పాటు గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత పట్టణంగా అభివృద్ధి చెందాలని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్‌లో ఉన్న టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులను ఆయన అభినందించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరం పట్టణం పట్టు చీరలకు ప్రసిద్ధి చెందడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో, కాలుష్యరహితంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా గ్రీన్ ధర్మవరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలకు బదులుగా పర్యావరణానికి అనుకూలమైన మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. మట్టి విగ్రహాల వినియోగంతో నీటి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చన్నారు. కాలుష్యరహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



