Breaking News

CAPCOను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు మరింత విస్తృతంగా కృషి
16వ జాతీయ వినియోగదారుల సదస్సు ఘనంగా ముగింపు

పుట్టపర్తి, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి).

వినియోగదారుల హక్కుల పరిరక్షణ, ప్రజల్లో వినియోగదారుల చైతన్యం పెంపొందించడంలో గత 35 సంవత్సరాలుగా కృషి చేస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ (CAPCO)ను దేశంలోనే అగ్రగామి వినియోగదారుల సమాఖ్యగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని CAPCO ఆంధ్రప్రదేశ్ చైర్మన్ జి. సురేష్ కుమార్ తెలిపారు.

పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ వినియోగదారుల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో వినియోగదారులకు తమ హక్కులు, బాధ్యతలు, నాణ్యతా ప్రమాణాలు, ఆహార భద్రత, చట్టపరమైన రక్షణపై విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.వినియోగదారుల సమస్యలను సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయంతో పనిచేస్తామని సురేష్ కుమార్ పేర్కొన్నారు. CAPCO ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వినియోగదారుల అవగాహన కార్యక్రమాలకు సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబుకు, శ్రీ సత్యసాయి జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సులో వినియోగదారుల హక్కుల పరిరక్షణ, ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలు, వినియోగదారుల చట్టాల అమలు, క్షేత్రస్థాయిలో వినియోగదారుల సంఘాల పాత్ర తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి సదస్సుకు హాజరైన వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, అతిథులను CAPCO చైర్మన్ జి. సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వారికి సర్టిఫికెట్లు అందజేశారు. సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సాయి ఆరామం కాన్ఫరెన్స్ హాల్ నిర్వాహకులు తోట్ల గంగాధర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో CAPCO వ్యవస్థాపకులు కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ బి.ఎస్.ఎన్. మూర్తి, గౌరవ చైర్మన్ నాగేశ్వరరావు, CADCO గౌరవ చైర్మన్ గౌరీ శంకర్, వైస్ చైర్మన్లు కర్లపాటి శ్రీనివాసులు, ఉషాదేవి, లావణ్య దీప్తి, భాస్కరరావు, ఆర్. శ్రీనివాసులు, తోట చిన్నప్ప, గురుమూర్తి, చిన్న తమ్మి చిన్నప్ప, పల్లం జనార్ధన్, గుర్రం వేణుగోపాల్, కేశవ, బుక్కపట్నం మండల వినియోగదారుల సంఘ సభ్యులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వినియోగదారుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *