ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేసిన ఎమ్మార్వో, బీఎల్‌వోలు
ఏ ఒక్క ఓటు పోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి : ఎమ్మెల్యే
నిజామాబాద్, జూలై 3:E6 న్యూస్ (శివ ఠాకూర్) ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వో వినయ్ సాగర్‌తో పాటు బీఎల్‌వోలు రజిత, లావణ్య, నరేష్‌లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అధికారులు పూర్తి పారదర్శకతతో, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రజలు కూడా ఈ ప్రక్రియకు పూర్తి సహకారం అందించి, అవసరమైన వివరాలను అధికారులకు అందజేసి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విజ్ఞప్తి చేశారు. SIR ప్రక్రియ విజయవంతానికి అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

